ప్రజల ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటి పన్ను ఊసెత్తని ప్రభుత్వం అకస్మాత్తుగా సిబ్బందికి టార్గెట్లు ఇవ్వడంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మరో వైపు పన్నులు చెల్లించలేక పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు సంపద సృష్టించడమంటే ఇలానా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
నక్కపల్లి: జిల్లాలో 2025–26 ఏడాదికి సంబంధించి ఇంటి పన్నులు నూరుశాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండడంతో పంచాయతీ సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు... ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీడియో సమావేశాలు, రోజువారీ సమీక్షలు నిర్వహిస్తుండడంతో పాటు డైలీ కలెక్షన్ నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ పాత బకాయిలతో కలిపి ఇంటి పన్ను వెంటనే చెల్లించాలని సంబంధిత పంచాయతీ అధికారులు జనాన్ని పట్టి పీడిస్తున్నారు. రెండేళ్లుగా పన్ను వసూళ్లపై దృష్టిసారించని ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఒత్తిడి తీసుకు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిపన్ను వసూళ్లపై ప్రభుత్వంనుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లాలో ఓ కార్యదర్శి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో జిల్లాలో సిబ్బంది భయాందోళన కు గురవుతున్నారు. అయినా తప్పని సరి పరిస్థి తుల్లో పన్నుల వసూలుకు పరుగులు తీస్తున్నారు. ప్రతిఏటా పన్నులు వసూలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, మేజర్‌పంచాయతీల్లో సక్రమంగానే జరుగుతుంది. నూరుశాతం కాకపోయినా కనీసం 80 శాతం వరకు వసూలు చేసే వారు. మైనర్‌పంచాయతీలైన గ్రామాల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గాని, అధికారులు గానీ పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. ఎన్నికల సందర్భంలో పోటీ చేసే అభ్యర్థులు ఇంటిపన్ను బకాయిలు ఉండకూడదన్న నిబంధనలను సాకుగా చూపించి పన్నులను వసూలు చేసే వారు. తర్వాత ఎవరో ఇంట్రస్ట్ ఉండి పన్ను చెల్లిస్తే తప్ప వసూలు చేసిన దాఖలాలు చాలా తక్కువే. సర్పంచ్‌లు సహితం ఇంటిపన్ను వసూళ్లపై పెద్దగా దృష్టిసారించేవారు కాదు. పన్ను చెల్లించాలని ఒత్తిడి తెస్తే ఓట్లు పడవేమోనన్న భయంతో సీరియస్‌గా తీసుకునేవారు కాదు. అయితే నిధుల లేమి కారణంగా చంద్రబాబు ప్రభుత్వం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. సర్పంచ్‌లతో సంబంధం లేకుండా అధికారులే గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పన్నులు వసూళ్లు చేయాలని హుకుం జారీచేసింది. మండల స్థాయి అధికారులను కూడా బాధ్యులను చేసింది. దీంతో కార్యదర్శి, బిల్లుకలెక్టర్, సచివాలయ సిబ్బంది, ఈవోపీఆర్‌డీ, ఎంపీడీవో తదితర మండల స్థాయి అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పన్నులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. పన్ను చెల్లించని వారి ఇళ్లకు ప్రతి రోజూ వెళుతూ పట్టి పీడిస్తున్నారు. ఒకే సారి ఐదారేళ్ల బకాయిలు చెల్లించాలంటూ ఇళ్ల యజమానులపై మెడమీద కత్తిపెట్టినట్టు ఒత్తిడి తెస్తుండడతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే సారి పన్ను మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెస్తే తాము ఎలా చెల్లించగలమని ప్రజలు వాపోతున్నారు. అధికారులనుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక ఇళ్ల యజమానులు అప్పో సొప్పో చేసి బకాయిలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పన్నుల చెల్లింపుపై
ఒత్తిడి తగదు
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ముక్కుపిండి పన్నులు వసూలు చేయడం సమంజసం కాదు.నాలుగైదేళ్ల పన్నులు ఒకే సారి చెల్లించాలని ఒత్తిడి చేయడం తగదు. ప్రతి ఏటా వసూలు చేయకుండా ప్రభుత్వానికి బుద్ధిపుట్టినప్పుడు నిధుల కొరత ఏర్పడినప్పుడు పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ప్రతిఏటా పన్నుల వసూలు చేయడం అధికారుల బాధ్యత. వారు సక్రమంగా వసూలు చేయకుండా ఒకే సారి వసూలుకు చర్యలు తీసుకోవడం తగదు. పంచాయతీల్లో రివిజన్ జరగడం లేదు. కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లు రివిజన్ రిజిస్టర్‌లో నమోదు చేసి పన్ను విధించాలి. యజమాని దరఖాస్తు చేస్తేతప్ప కొత్త ఇంటిని రికార్డుల్లో నమోదు చేయడం లేదు.
–మేడేటి శంకర్, ఇంటియజమాని, నక్కపల్లి
జిల్లాలో ఇంటి పన్నుల బకాయిల వివరాలు
మండలం మొత్తం డిమాండ్ వసూళ్లు బకాయిలు
(లక్షల్లో)
నక్కపల్లి రూ.193.77 రూ.137.00 రూ.60లక్షలు
పరవాడ రూ.467.69 రూ.296.71 రూ.171.49
రోలుగుంట రూ.72.65 రూ.45.00 రూ.27.65
యలమంచిలి రూ.100.68 రూ.56.67 రూ.44.09
చీడికాడ రూ.66.84 రూ.34.22 రూ.27.15
నర్సీపట్నం రూ. 66.84 రూ.37.07 రూ.29.07
గొలుగొండ రూ.96.08 రూ. 53.67 రూ.44.84
కె.కోటపాడు రూ.138.89 రూ.71.34 రూ.67.55
దేవరాపల్లి రూ.93.06 రూ.46.55 రూ.46.51
కశింకోట రూ.372.06 రూ.182.89 రూ.189.01
మాకవరపాలెం రూ.122.74 రూ.58.76 రూ.63.98
రావికమతం రూ.125.91 రూ.56.76 రూ.69.15
కోటవురట్ల రూ.75.38 రూ.33.73 రూ.41.65
నాతవరం రూ.91.67 రూ.40.27 రూ.51.39
రాంబిల్లి రూ.100.46 రూ.40.32 రూ.60.15
బుచ్చెయ్యపేట రూ.109.35 రూ.43.08 రూ.66.26
మాడుగుల రూ.126.22 రూ.47.79 రూ.78.43
సబ్బవరం రూ.192 రూ.70.21 రూ.121.79
ఎస్.రాయవరం రూ.255.03 రూ.92.32 రూ.162.71
అనకాపల్లి రూ.339.17 రూ.117.67 రూ.221.05
మునగపాక రూ.156.47 రూ.55.35 రూ.103.12
అచ్యుతాపురం రూ.295.76 రూ.98.25 రూ.197.51
చోడవరం రూ.343.73 రూ.112.93 రూ.230.80
పాయకరావుపేట రూ.429.00 రూ.139.16 రూ.289.84
మొత్తం రూ.4,427.24 రూ.1,954.62 రూ.2,472.00
జిల్లాలో పరిస్థితి ...
జిల్లాలో మొత్తం 24 మండలాల్లో 672కు పైగా గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో రూ.44.27 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పటివరకు రూ.19 కోట్లు వసూలు చేసి, 44శాతం లక్ష్యం పూర్తిచేశా రు. ఇంకా సుమారు రూ.25కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇంటిపన్నుల వసూళ్లలో జిల్లా లో నక్కపల్లి మండలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలంలో రూ.1.93 కోట్లకు గా ను ఇప్పటి వరకు రూ.1.37 కోట్ల పైనే వసూలు చేశారు. పరవాడ మండలంలో రూ.4.67కోట్లకు గాను రూ.3 కోట్లపైనే వసూలు చేశారు. సెప్టెంబరులో ప్రారంభించి మార్చి నెలాఖరునాటికి పన్నులు వసూళ్ల ప్రక్రియ పూర్తిచేయాలి. నెలాఖరు దగ్గరపడుతుంటడం, గ్రామాల్లో పన్నులు అనుకున్న స్థాయిలో వసూళ్లుకాకపోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలయింది. నూరుశాతం పూర్తిచేయకపోతే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


