అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయ పునఃప్రారంభం, కలశ ప్రతిష్ట, మహోసంప్రోక్షణ కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు రేజేటి శ్రీరామాచార్యులు పర్యవేక్షణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అమ్మవారి నూతన ఆలయంలో వేదపారాయణ, గణపతిపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించి, కొత్తగా నిర్మించిన అమ్మవారి ఆలయం, రాజగోపురంలపై ఉదయం 10.58 గంటలకు పసిడి కలశ పునఃప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 3 గంటల నుంచి భక్తులకు నూతన ఆలయంలో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు రాజగోపురం, అమ్మవారి ఆలయ గోపురం మీద నుంచి బూరెలు, వివిధ రకాలైన పిండి వంటకాలను వేశారు. సాయంత్రం నేలవేషాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత, ఆలయ సహాయ కమిషనర్ యళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు), మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు మళ్ల సురేంద్ర, బత్తుల తాతబాబు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


