కశింకోట: సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సమర్థంగా వినియోగించుకోవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పరవాడ సింహాచలం నాయుడు సూచించారు. మండలంలోని పాత కన్నూరుపాలెంలో 2005 సమాచార హక్కు చట్టంపై ప్రజలకు ఆదివారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సాధారణ ప్రజలు సైతం ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటారన్నారు. ఈ సందర్భంగా పాత కన్నూరుపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని స్థానికులు వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అనంతరం కమిషనర్ నాయుడును దుశ్శాలువా, పూలమాలలతో సన్మానించారు. విశాఖపట్నం అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన సందర్భంగా తన సొంత గ్రామానికి వచ్చిన కన్నూరు అప్పలనాయుడును ఈ సందర్భంగా స్థానికులు దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముందుగా గ్రామంలో ముత్యమాంబ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. స్థానికులు, యువకులు, మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


