జిల్లా పంచాయతీ అధికారి సందీప్
నాతవరం: జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలను జాతీయ అవార్డుల కోసం ఎంపిక చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి సందీప్ తెలిపారు. మండలంలో శృంగవరం పంచాయతీలో సోమవారం కేంద్ర కమిటీ బృందం పర్యటించనున్న తరుణంలో ఆదివారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామ సచివాలయంలో మండల స్థాయి అధిరారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ దీన దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కింద జాతీయ అవార్డులు ప్రకటిస్తుందన్నారు. ఈ అవార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పంచాయతీలను ఎంపిక చేయగా, వాటిలో అనకాపల్లి జిల్లా నుంచి రెండు పంచాయతీలను గుర్తించినట్టు చెప్పారు. జిల్లాలో 24 మండలాల్లో 646 గ్రామ పంచాయతీలుండగా నాతవరం మండలంలో శృంగవరం, నక్కపల్లి మండలంలో డి.ఎల్.పురంను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఈ పంచాయతీల్లో సోమవారం కేంద్ర కమిటీ పర్యటిస్తుందని చెప్పారు. కేంద్ర కమిటీ నివేదిక అధారంగా అవార్డు ప్రకటిస్తారని చెప్పారు. శృంగవరం పంచాయతీని గుడ్ గవర్నర్ అవార్డుకు, నక్కపల్లి మండలంలో డి.ఎల్. పురం పంచాయతీని చైల్డ్ ప్రెండ్లీ కింద ఎంపిక చేశారన్నారు కేంద్ర కమిటీ సభ్యులు పర్యటన అనంతరం అవార్డు ఎంపిక పక్రియ ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, రమణ తదిరులు పాల్గొన్నారు.


