శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పట్టణం, గ్రామాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్, సబ్‌డివిజన్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని చెప్పారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని, యువత పెడదారి పట్టకుండా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతంగా ఉండాలని, ఆన్‌లెన్ ఆర్థిక నేరాల పట్ల సామాన్య ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మహిళల భద్రత, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల సాయంతో క్షేత్రస్థాయిలో మహిళలకు పూర్తి భరోసా కల్పించాలని, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్ కేసులను త్వరితగతిన పూర్తిచేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐలు అల్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


