బైక్‌లు, బంగారం, వెండి ఆభరణాలు రికవరీ
పాయకరావుపేట: పలు చోరీ కేసులకు సంబంధించి బైక్‌లు, బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్టు నర్సీపట్నం డీఏస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్ళూరు మండలం నేలపల్లికి చెందిన పలివెల చరణ్‌తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. కాకినాడకు చెందిన మజ్జి నరేంద్రకుమార్, ఏలూరుకు చెందిన భూపతి దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. వీరందరూ పలు ప్రాంతాల్లో దొంగలించిన 16 మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పాయకరావుపేట పట్టణంలోని బృందావనం ప్రాంతం, మంగవరం గుడి, దుర్గానగర్‌లో గల రామాలయంలో విగ్రహాలు, బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారని, వీటి పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయా కేసుల్లో రెండు తులాల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్నవారిని కూడా కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరందరూ తుని, పాయకరావుపేట, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, అన్నవరం తదితర ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసినట్లు తెలిసిందన్నారు. వీరందరూ బైక్‌లు దొంగలించి పాయకరావుపేట పట్టణానికి చెందిన జాన్ అనే వ్యక్తికి అప్పగించేవారని, జాన్, అభి, హరి అనే వారు వాటిని వివిధ ప్రదేశాల్లో విక్రయించి, వచ్చి డబ్బులను నిందితులకు ఇచ్చేవారని డీఏస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సీఐ జి.అప్పన్న ఆధ్వర్యంలో టీమ్ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు. నిందితులను పట్టుకున్న ఎస్‌ఐలు పురుషోత్తం, ఆలీ, కానిస్టేబుళ్లు సతీష్, మదీనాలను ఏస్పీ అభినందించినట్టు చెప్పారు.


