పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్టు
కశింకోట: గంజాయి కేసులో పట్టుబడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. మండలంలోని తాళ్లపాలెం–నర్సీపట్నం మార్గంలో అచ్చెర్ల కూడలి వద్ద వీరిని పట్టుకున్నట్టు చెప్పారు. ఏజెన్సీ నుంచి కారు డిక్కీలో 30 కిలోల గంజాయిని తరలిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 25న అచ్చెర్ల రోడ్డు వద్ద పోలీసులకు చిక్కినట్టు చెప్పారు. అప్పట్లో డ్రైవర్ ఈశ్వరసాయిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అతడిని విచారించగా నిందితులు పేర్లు వెల్లడించినట్టు తెలిపారు. ఈమేరకు కోటవురట్ల మండలం గొల్లల సన్యాసిరాజుపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్లు పంచదార్ల రమణ, పంచదార్ల లోవరాజు పరారీలో ఉన్నారన్నారు. వీరిద్దరు సోదరులని తెలిపారు. వీరిని తమ సిబ్బంది సహకారంతో అచ్చెర్ల రోడ్డు వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిలో లోవరాజు గంజాయి రవాణా చేస్తుండగా, రమణ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తుంటాడన్నారు. రమణ గతంలో జిల్లాలో సుమారు ఏడు గంజాయి కేసుల్లో అరెస్టు అయి కండిషన్ బెయిల్‌పై 2023లో విడుదల అయ్యాడన్నారు. లోవరాజు మాడుగుల పోలీసు స్టేషన్‌లో 2020లో అరెస్టు అయి బెయిల్‌పై విడుదల అయ్యాడన్నారు. వీరు పరారీలో ఉండటంతో చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశామన్నారు.కేసు దర్యాప్తులో ఉందని సీఐ తెలిపారు.


