పిల్లలను చూడనీయడం లేదు...
గొలుగొండ: గొలుగొండ కస్తూర్భా బాలికల వసతిగృహం వద్ద ఆదివారం సాయత్రం తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఆదివారం కావడంతో తమ పిల్లలను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు తమ పిల్లలను చూపించకుండా ఉండడంపై మండిపడ్డారు. ప్రతి ఆదివారం తమ పిల్లలను చూడడానికి వస్తున్న సమయంలో ఇక్కడ సిబ్బంది దుర్భాషలాడి అవమానిస్తున్నారని ఆరోపించారు. పిల్లల అవసరాలు ఉంటాయని వాటిని తెలుసుకొని తీసుకురావడం కోసం వస్తే ఇక్కడ పట్టించుకోలేదన్నారు. దీనిపై గేటు వద్ద అరగంటపాటు బాలికల తల్లిదండ్రులు గొడవకు దిగారు. సిబ్బంది పనితీరు బాగోలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతీసారి ఇదే జరుగుతుందని, పిల్లలను కలవనీయకుండా గేటు తాళం తీయడం లేదని ఆరోపించారు. వసతిగృహం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వారం రోజులు క్రితం రాత్రి 11 గంటలకు భోజనం పెట్టడం జరిగిందని ఆరోపించారు. పిల్లలకు ఇక్కడి కష్టాలు తమకు చెపుతుంటే చెప్పిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఫిర్యాదులు చేస్తామని తెలిపారు.
కస్తూర్బా హాస్టల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన


