మరో ప్రజా పోరాటం
● అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిన మునగపాక
● నేడు యలమంచిలి పరిసరవాసుల ఆవేదనకు అద్దం పట్టేలా మరో ఆందోళనకు శ్రీకారం
● నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపరాదంటూ అభ్యంతరం
● సుదూర ప్రాంతమైన నక్కపల్లి కేంద్రమైతే తప్పని ఇబ్బందులు
● నేటి నుంచి 18 వరకు మునగపాకలో రిలే నిరాహార దీక్షలు
● రాత్రి పూట గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన
మునగపాక: గతంలో 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రషర్ల ఉద్యమం.. అలాగే నల్లబెల్లం తయారీ నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం.. విద్యుత్ చార్జీల పెంపుపై రహదారి దిగ్బంధాలు, రాస్తారోకోలు నిర్వహించిన చరిత్ర మునగపాకకు ఉంది. నిర్భయంగా పోరాడడం, పాలకుల వెన్నులో వణుకు పుట్టించడం ఈ ప్రాంతవాసులకు వెన్నతో పెట్టిన విద్య. సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేయాలి. ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయాలి. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయమే అయినా యలమంచిలి నియోజకవర్గాన్ని ప్రతిపాదిత నక్కపల్లి డివిజన్‌లో కలపడం వల్ల ప్రజలకు కష్టాలు పెరుగుతాయి. 2009లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనకాపల్లి డివిజన్ ఏర్పాటుకు బీజం పడింది. ఆ ఫలితంగా 2013లో అనకాపల్లి కేంద్రంగా ఆర్డీవో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అనకాపల్లి పరిసర మండలాల ప్రజలు రెవెన్యూపరమైన సమస్యలు ఉంటే దూరంగా ఉన్న విశాఖకు వెళ్లాల్సి వచ్చేది. యలమంచిలి పరిసరాలను నక్కపల్లి డివిజన్‌లో కలిపితే మళ్లీ పాత సమస్యను తిరగతోడినట్టవుతుంది.
చిక్కులు తెచ్చిపెడుతున్న కొత్త జీవో
నక్కపల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు గత నెల 27వ తేదీన జీవో నెంబరు 1491ను ప్రవేశపెట్టారు. యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను నక్కపల్లి డివిజన్‌లో కలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు కొత్త రెవెన్యూ కేంద్రమైన నక్కపల్లిని స్వాగతిస్తూనే అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే నాలుగు మండలాలను కొనసాగించాలన్న డిమాండ్‌ను తీసుకువస్తున్నారు. మునగపాక, అచ్యుతాపురం మండలాల ప్రజలు నక్కపల్లి వెళ్లాలంటే రానుపోను 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ప్రజలు మండిపడుతున్నారు.
నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు,
కొవ్వొత్తుల ప్రదర్శనలు
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇప్పటికే రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు, తహసీల్దార్లకు వినతి పత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చారు. మునగపాకలో ఈ నెల 8 నుంచి 18 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు రెండు నుంచి మూడు పంచాయతీలకు తగ్గకుండా దీక్షలో కూర్చొనేలా చర్యలు చేపట్టారు. అదే కాలంలో రాత్రి సమయంలో గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేసేలా నిర్ణయం తీసుకున్నారు. మధ్యలో 15వ తేదీన మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతి అందించేలా నిర్ణయించారు. గ్రామ సభలు, పంచాయతీలో తీర్మానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఉద్యమాల పురిటిగడ్డ మునగపాక మరో పోరాటానికి నడుం కడుతోంది. ఎంతటి సమస్య వచ్చినా ఇక్కడి ప్రజలు
రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తారు.
గతంలో అనేక సందర్భాల్లో ఇలా పోరాడి విజయం సాధించారు. ఆ స్ఫూర్తితో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో తమకు ఎదురవుతున్న కష్టనష్టాలపై ‘నిరశన’కు దిగాలని నిర్ణయించారు. సోమవారం
నుంచి రంగంలోకి దిగుతున్నారు.


