ఏయూలో తత్కాల్ విధానం రద్దు
సాధారణ రుసుముతోనే వేగవంతంగా సర్టిఫికెట్ల జారీ
స్పెషల్ ఎగ్జామినేషన్ స్థానంలో ఇనిస్టెంట్, స్పెషల్ డ్రైవ్ పరీక్షలు
11న పాడేరులో ఏయూ గ్రామీణ అనుసంధానం కార్యక్రమం
ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ వెల్లడి
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 28 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద 40 మంది విశ్వవిద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. ఏయూ సెనేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై సాధారణ రుసుముతోనే వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. పాత స్పెషల్ ఎగ్జామినేషన్ స్థానంలో రెండు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఒకే సబ్జెక్ట్‌లో తప్పిన విద్యార్థుల కోసం ఇనిస్టెంట్ పరీక్ష, దశాబ్ద కాలంగా పరీక్షలు రాయడానికి వేచి చూస్తున్న అభ్యర్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా కెరీర్ ప్లానింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వీసీ వెల్లడించారు.మౌలిక వసతుల కల్పనలో భాగంగా 350 కంప్యూటర్లను త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. సీ4ఐ4 ల్యాబ్, ఎలిమెంట్ భవనంలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. పూర్వోదయ పథకంలో హాస్టల్ భవనాల నిర్మాణం కోసం రూ.170 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఏయూ వైద్యశాలలో నూతనంగా వైద్యులు, కన్సల్టెంట్ వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని, అదనపు పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అలాగే బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నివారించేందుకు క్యాంపస్‌లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సౌత్ క్యాంపస్‌లో కొన్ని ద్వారాలను మూసివేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల అనుసంధానం(ఆలుమ్ని ఎంగేజ్‌మెంట్) కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ నెల 11న పాడేరులో ‘ఏయూ గ్రామీణ అనుసంధానం’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 1,500 క్యాడెట్లతో ఈ నెల 23న బీచ్‌రోడ్డు కన్వెన్షన్ సెంటర్‌లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


