ఆ 12 గంటలు ఏం చేశారు.?
గత ప్రభుత్వ హయాంలో ప్రగతి పథంలో కేజీహెచ్
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అమరావతిలో ఉన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. సీఎస్ ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోలు.. ఎవరి పని వారిదే అన్నట్లుగా వదిలేశారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడ్డారు. అప్పుడే పుట్టిన శిశువులు అవస్థలు ఎదుర్కొన్నారు. బాలింతలు బాధలనుభవించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు నరకం చూశారు. ఆక్సిజన్ అందక శ్వాస కోసం ఆపసోపాలు పడ్డారు. దాదాపు 12 గంటల పాటు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని చీకట్లో మగ్గింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు..? దీన్నిబట్టి చూస్తే పేదల వైద్యం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో అవగతమవుతుంది.
జనరేటర్లు ఏమయ్యాయి.?
ప్రస్తుతం కేజీహెచ్‌లో 5 జనరేటర్లు ఉన్నాయి. వాటిని అత్యవసర వైద్య విభాగాలకు మాత్రమే అన్నట్లుగా వినియోగిస్తుంటారు. భూగర్భ కేబుల్ విద్యుత్ కనెక్షన్ కట్ అవ్వడంతో అనేక వార్డులు అంధకారంలో ఉన్నాయి. భావనగర్ వార్డు, మార్చురీ, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లలవార్డు, గైనిక్ వార్డు.. ఇలా అనేక వార్డుల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 5 జనరేటర్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఈ వార్డుల్లో ముఖ్యమైన వాటికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ అధికారులు అలా చేయలేదు. ఈ ఐదింటిలో రెండు జనరేటర్లు సరిగా పనిచేయడం లేదని మోంథా తుపాన్ సమయంలో గుర్తించారు. వాటిని కూడా సరిచేయలేదని తెలుస్తోంది.
జనరేటర్లు అద్దెకు తీసుకోలేదెందుకు..?
ఆస్పత్రిలో ఏదైనా అత్యవసరం అయినప్పుడు సొంత నిధులు ఖర్చు చేసి.. జనరేటర్లు తీసుకువచ్చేందుకు వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదు. సూపరింటెండెంట్ డా.వాణి కోర్టు పనిమీద అమరావతి వెళ్లిపోయారు. తర్వాత స్థానంలో ఉన్న అధికారులు చొరవ తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు కూడా సాయంత్రం వరకు సమాచారం ఇవ్వలేదు. జనరేటర్లు అద్దెకు తీసుకోవడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ అనుమతి ఉంటే సరిపోతుంది. కానీ దానికి కూడా ప్రయత్నించకుండా రోగుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. అద్దెకు జనరేటర్లు ఎందుకు తీసుకోలేదంటే తమ పరిధిలో లేదంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.
అధికారుల మధ్య పొరపొచ్చాలే కారణమా..?
కేజీహెచ్‌లో ఉన్నతాధికారులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి గ్రూపు రాజకీయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే జనరేటర్లను అద్దెకు తీసుకురాలేదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా 12 గంటల పాటు కేజీహెచ్‌లో చీకట్లు కమ్ముకున్నాయి. ముఖ్యంగా పిల్లల వార్డులో చిన్నారులు, ఇంక్యుబేటర్స్‌లో చికిత్స పొందుతున్న నవజాతశిశువులు నరకయాతన అనుభవించారు. బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ అందక భావనగర్, రాజేంద్రనగర్ వార్డులో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న వారంతా అవస్థలు పడ్డారు.
కేజీహెచ్‌పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం..!
కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వ వైద్యంపై శీతకన్ను వేసింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది నియామకాన్ని గాలికొదిలేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కేజీహెచ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఓపీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మందులు కూడా సరిపడా సరఫరా చేయకపోవడంతో పేదలంతా బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఓవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్రపన్నుతూ.. మరోవైపు కేజీహెచ్ వంటి వైద్య శాలలపైనా నిర్లక్ష్యం వహిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగితే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గుండె ఆపరేషన్లు ఆగిపోయాయంటే.. పేదోడి వైద్యంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై వైఎస్సార్‌సీపీ విమర్శల దాడి చేస్తే మళ్లీ ఇటీవలే ఆపరేషన్లు మొదలు పెట్టారు.
అర్ధరాత్రి 12 గంటలకు విద్యుత్ పునరుద్ధరణ
కేజీహెచ్‌లో మంచినీటి పైపులైన్ నిర్వహణలో భాగంగా ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బ్లాక్ సమీపంలో పనులు చేస్తున్న సమయంలో యూజీ కేబుల్ కట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న తర్వాత కేబుల్ పోయిన ప్రాంతాన్ని గుర్తించి కేబుల్‌ను జాయింట్ కిట్ ద్వారా మరమ్మతులు చేపట్టామని ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ శ్యామ్‌బాబు తెలిపారు. పాడైపోయిన కేబుల్‌ను సరిచేసి రాత్రి 11.45 గంటలకు పనులు పూర్తి చేశామనీ.. 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఎస్‌ఈ వెల్లడించారు.
సెల్‌ఫోన్ వెలుగులో రోగులకు వైద్యం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రగతి పథంలో పరుగులు తీసింది. ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదలకు అత్తుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేసింది. గత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించగా ప్రభుత్వం మారే సమయానికి రూ.60 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి.
సీఎస్‌ఆర్ బ్లాక్ పూర్తిచేసి 200 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్రిటికల్ కేర్ యూనిట్‌తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరణ చేపట్టింది.
వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటిల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసింది.
ఒక్క కేజీహెచ్‌కే కొత్తగా 8 అంబులెన్స్‌లు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, కనీసం 200 మంది ఉండేలా వెయిటింగ్ హాల్స్‌ను తీర్చిదిద్దింది.
రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అదనంగా మరో క్యాజువాలిటీని రూ.30 లక్షలతో నిర్మించింది.
లేబొరేటరీ, మొబైల్ ఎక్స్‌రే యూనిట్, ఆల్ట్రా స్కానింగ్ సిద్ధం చేసింది.
కీలకమైన కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షలతో ఆధునికీకరించింది.
ఐసీసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, 120 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే కేజీహెచ్ చరిత్రలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు.
గుండె జబ్బుల నియంత్రణ కోసం స్టెమీ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రధాన ద్వారాన్ని రూ.30 లక్షలతో గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఈ పనులు పూర్తయ్యాయి.
కేజీహెచ్‌లో అంధకారంపై
సర్వత్రా విమర్శలు
విద్యుత్ సరఫరా లేనప్పుడు
జనరేటర్లు ఎందుకు తీసుకురాలేదు.?
ఉన్న జనరేటర్లు పనిచేయట్లేదని
తెలిసినా చర్యలు శూన్యం
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేజీహెచ్ అధికారుల వైఫల్యం
గత వైఎస్సార్ సీపీ హయాంలో
కేజీహెచ్‌కు కొత్త రూపు
కూటమి వచ్చిన తర్వాత పేదల
వైద్యంపై నిర్లక్ష్యపు పడగ
ఆ 12 గంటలు ఏం చేశారు.?
ఆ 12 గంటలు ఏం చేశారు.?


