స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ కలిగి ఉండాలి
అనకాపల్లి: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల నిర్వాహకులు రవాణాశాఖ నిబంధనలను పాటించాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే స్కూల్‌బస్ డ్రైవర్లుగా నియమించాలని జిల్లా ఇన్‌ఛార్జి ఆర్టీవో ఎ.వి.రమణ అన్నారు. జీవీఎంసీ విలీనగ్రామమైన కె.ఎన్.ఆర్.పేట ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యాజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ బస్‌లు ఫిట్‌నెస్‌ను ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, బస్సులను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నడపాలని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన పరికరాలను బస్సుల్లో భద్రపరచాలని సూచించారు. బస్‌ల్లో హ్యాండ్ బ్రేక్, మెయిన్ బ్రేక్, వాహనంపై నాలుగు మూలలు అంబర్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలో 50 ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన ప్రతినిధులు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


