తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం.. | - | Sakshi
Sakshi News home page

తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం..

Nov 8 2025 7:48 AM | Updated on Nov 8 2025 7:48 AM

తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం..

తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం..

నక్కపల్లి: బల్క్‌ డ్రగ్‌పార్క్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం నివాస ప్రాంతాలు కోల్పోయిన వారికి పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు సిమెంట్‌, ఐరన్‌, వంటి మెటీరియల్‌ ఉచితంగా గానీ తక్కువ ధరకు గాని ఇప్పించాలని, అలాగే ఇళ్లు ఖాళీ చేసేందుకు ఏడాది సమయం కావాలని పలువురు నిర్వాసితులు కలెక్టర్‌ను కోరారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చందనాడ, అమలాపురం, బుచ్చిరాజుపేట, డీఎల్‌ఫురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూసేకరణ పూర్తయి నష్ట పరిహారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించిన గ్రామాల్లో 734 మంది నిర్వాసితులను గుర్తించి వారికి పెదబోదిగల్లం వద్ద కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీలో ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీరందరికీ ఇళ్ల నిర్మాణం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, రూ.8.90 లక్షల నగదు సాయం అందించామన్నారు. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులు, స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాసితులంతా తమ తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన కాలనీలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. నవంబరు 14 నాటికి ఎంతమంది తమ ప్రాంతాలను ఖాళీ చేసి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటారో చెప్పాలని ఆయా గ్రామాల ప్రతినిధులకు సూచించారు. దీనిపై నిర్వాసితుల తరపున తళ్ల భార్గవ్‌, గంటా తిరుపతిరావు, సూరాకాసుల గోవిందు, గబ్బర్‌సింగ్‌, లక్ష్మణరావు, కె.శ్రీను తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాసకాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదన్నారు. సిమెంట్‌, ఐరన్‌ ఉచితంగా అందజేయాలని కోరారు. ఇంటి నిర్మాణానికి అయ్యే మెటీరియల్‌ ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరించాలని అన్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలంటే వీలుపడదని అన్నారు. కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మాత్రమే జరిగిందని, లబ్ధిదారులకు ఇప్పటివరకు వాటిని అప్పగించలేదన్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వాడుకనీరు సదుపాయం కల్పించాలన్నారు. ఇవన్నీ పూర్తిచేసిన తర్వాత ఏడాది సమయం ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామన్నారు. నెలా, రెండునెలల్లో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేయడం కష్టమని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి ఆరుమాసాల సమయం పడుతుందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో వివాహాలైన ఆడపిల్లలకు ఇప్పటివరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయలేదని తెలిపారు. చాలా మంది ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించలేదని, అలాగే నిర్వాసితుల సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇవేవీ పరిష్కరించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని కోరడం సమంజసం కాదని విన్నవించారు. కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ మాట్లాడుతూ సిమెంట్‌, ఐరన్‌ హోల్‌సేల్‌ ధరలకు ఇప్పిస్తామని, అలాగే ట్రాన్స్‌పోర్టు ఖర్చుల నుంచి వెసులు బాటు కల్పిస్తామన్నారు. ఉచితంగా ఇప్పించడం సాధ్యం కాదన్నారు. ఇళ్లు ఖాళీ చేసే లబ్ధిదారులు వేరొక చోట అద్దెకు ఉంటే అద్దె మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. నిర్వాసితులు మాత్రం వీలైనంత తొందరగా ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడి తెలియజేస్తామని ప్రతినిధులు కలెక్టర్‌కు హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ పాల్గొన్నారు.

ఏడాది సమయం కావాలి

సిమెంట్‌, ఐరన్‌ తక్కువ ధరకు

ఇప్పించాలి

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సమస్యలు

పరిష్కరించాలి

కలెక్టర్‌ను కోరిన నిర్వాసితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement