చోరీ కేసులో 100 గ్రాముల సొత్తు స్వాధీనం
తాటిచెట్లపాలెం: ద్వారకా క్రైం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని గతంలోనే అరెస్టు చేయగా, అతను తాకట్టు పెట్టిన చోరీ సొత్తును తాజాగా హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ క్రైం ఇన్‌చార్జి అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. సీతమ్మధార ఏఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న గుంటూరు విక్రమాదిత్య వర్మ తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం జూలై 17తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని కొనితివాడకు వెళ్లారు. జూలై 20న తిరిగి వచ్చేసరికి వారి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం గమనించారు. బెడ్‌రూంలో ఉన్న బీరువాలో ఉంచిన సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించి వెంటనే ద్వారకా క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారకా క్రైం పోలీస్‌స్టేషన్ సీఐ వి. చక్రధరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎస్.రాజు, సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు, మాజీ జవాన్ బసవ కిరణ్‌కుమార్ దొంగతనం చేసినట్టు గుర్తించి, ఆగస్టు 5న మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకానగర్ ఎస్‌వీటీ జంక్షన్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. అతనిది శ్రీకాకుళం జిల్లా కాగా.. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత చోరీ సొత్తు గురించి పోలీసులు విచారించినా.. ఫలితం లేకపోయింది. నిరంతర విచారణ ఫలితంగా సుమారు మూడు నెలల తర్వాత నిందితుడు చోరీ సొత్తును హైదరాబాద్‌లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి, 100 గ్రాముల బంగారు ఆభరణాలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేసిన ద్వారకా సబ్ డివిజన్ సిబ్బందిని సీపీ, డీసీపీ క్రైమ్ అభినందించారు.


