వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న స్పీకర
మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజం
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్రమ కేసులు పెట్టిస్తూ శునకాందనం పొందుతున్నారని ఆ పార్టీ నర్సీపట్నం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజమెత్తారు. గురువారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాకవరపాలెం మండలం బయ్యవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సుకల శ్రీనివాసరావు ఆ గ్రామ వీఆర్వో దగ్గరకు వెళ్లి వైఎస్సార్‌సీపీ ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే ...టీడీపీ నాయకుడు లాలం సీతారామతేజ దాడి చేశాడని చెప్పారు. వీఆర్వోపై స్పీకర్ ఒత్తిడి తెచ్చి మా నాయకుడు పై అక్రమ కేసు కూడా పెట్టించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మాకవరపాలెం ఎస్‌ఐ మా పార్టీ నాయకుడును ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సంఘటన నవంబర్ ఒకటో తేదీన జరిగితే...2వ తేదీ రాత్రి 8 గంటలకు అంటే 33 గంటల తర్వాత కేసు పెట్టారన్నారు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన రోజు నుంచి 5 వ తేదీ వరకూ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మాకవరపాలెం పోలీసు స్టేషన్‌లో శ్రీనివాసరావును ఉంచి, వేధించారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీనివాసరావును మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని, అయితే అదే రోజు పీవీఆర్ థియేటర్ ముందు వీఆర్వో, టీడీపీ నేతలపై శ్రీనివాసరావు దౌర్జన్యం చేసినట్లు మరో కేసు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారని చెప్పారు. స్టేషన్‌లో ఉన్న వ్యక్తి ఇంకో దగ్గరకు వెళ్లి దౌర్జ న్యం చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు రోజూ స్టేషన్‌కు వచ్చి డ్యూటీ చేయడం లేదని, మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుని అయ్యన్నపాత్రుడు ఎవరిపై కేసు పెట్టమని చెబితే వారిపై కేసులు నమోదు చేసి వేధించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పో లీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. రానున్నది మా ప్రభుత్వం...ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధి స్తున్న అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


