ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళకు గాయాలు
యలమంచిలి రూరల్: యలమంచిలి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్లే అనకాపల్లి డిపోకు చెందిన ఏపీ 31టీసీ1314 పల్లెవెలుగు ఆర్డినరీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రంగా గాయపడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మహిళ బస్సు నుంచి జారిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాలివి..రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామానికి చెందిన జోరీగల అచ్చియ్యమ్మ(58) యలమంచిలి నుంచి సొంతగ్రామానికి వెళ్లేందుకు యలమంచిలి ఆర్టీసీ బస్టాండులో బస్సెక్కడానికి వచ్చింది. చదువు రాకపోవడంతో పొరపాటున పాయకరావుపేట వెళ్లే బస్సు ఎక్కింది. కాంప్లెక్సు నుంచి బస్సు బయలుదేరిన వెంటనే అచ్చియ్యమ్మ తాను ఎక్కాల్సిన బస్సు కాదని తెలుసుకుంది. ఈ క్రమంలో ఆమెను బస్సు దిగాలని కండక్టరు, డ్రైవరు చెప్పగా ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా నడపడంతో ఆమె జారిపడింది. ఆమె తల వెనుక భాగానికి రక్తగాయమైంది. బస్సు నుంచి జారిపడిన అచ్చియ్యమ్మను పట్టించుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వగా అక్కడున్న ఓ విలేకరి ఫోటోలు తీయడంతో ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి గాయపడిన అచ్చియ్యమ్మను ఆటోలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. గాయపడిన మహిళకు యలమంచిలి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై అనకాపల్లి డిపో మేనేజర్, డీపీటీవోలు బస్సు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాకపోకలు సాగించే పలు బస్సులకు ఉంచుతున్న గమ్యస్థానల పేర్లతో ఉన్న బోర్డులు తికమకగా ఉంటున్నాయని, దీనివల్ల ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని పలువురు మండిపడుతున్నారు. బస్‌కాంప్లెక్స్‌లో చదువురాని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించడానికి నియమించిన గైడ్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.


