రోడ్ల మరమ్మతుల కోసం ఆమ్‌ఆద్మీ దీక్ష
చోడవరం: దెబ్బతిన్న రోడ్లన్నీ మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లుగా మార్చుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ హామీని తుంగలోకి తొక్కి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లి –చోడవరం, వడ్డాది, కొత్తకోట, నర్సీపట్నం రోడ్డు, చోడవరం–మాడుగుల మెయిన్‌రోడ్డు పెద్దపెద్ద గోతులు పడి అత్యంత ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ రోడ్డును బాగుచేయాలని, రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష బుధవారం నాటికి 9వరోజుకి చేరుకుంది. శిబిరంలో ఆమ్‌ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్‌కుమార్, జిల్లా కన్వీనర్ కొణతాల హరనాథబాబు, జిల్లా కార్యదర్శి బలివాడ రామసంతోష్, చోడవరం నియోజవకర్గం ఇన్‌ఛార్జి వేగి మహాలక్ష్మినాయుడు మహిళా అధ్యక్షురాలు శీతల్‌మదాన్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పవన్‌కుమార్ కూర్చున్నారు. సుమారు 50 కిలోమీటర్ల మేర మెయిన్‌రోడ్డు అంతా పెద్దపెద్ద గోతులతో చాలా ప్రమాదకరంగా ఉందని, వర్షాలకు ఆ గోతుల్లో అనేక వాహనాలు పడి ప్రమాదాలు జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు.


