తాండవ స్పిల్ వే నుంచి నీటి విడుదల
నాతవరం: తాండవ జలాశయం ప్రస్తుతం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుందని, ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వర్షం నీరు ప్రవహించడం వల్ల స్పిల్ వే గేట్ల నుంచి మిగులు నీరు విడుదల చేస్తున్నట్టు తాండవ జలాశయం డీఈఈ అనురాధ తెలిపారు. మంగళవారం నుంచి తాండవ జలాశయం నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుందని, జలాశయం దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాండవ జలాశయం గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379కి చేరుకుందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి తాండవ జలాశయానికి ఇన్‌ఫ్లో ద్వారా 1430 క్యూసెక్కులు నీరు రాగా స్పిల్ వే గేట్లు ద్వారా 1237 క్యూసెక్కుల నీటిని నదిలోనికి విడిచిపెట్టడం జరుగుతుందన్నారు. దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


