ఖండివరం ఉపాధి హామీ పథకం టీఏపై విచారణ
చీడికాడ: ఖండివరం ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ మోహన్‌రావుపై కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం గ్రామంలో ఏపీడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖండివరంలో ఉపాధి పనులు పరిశీలించే టెక్నికల్ అసిస్టెంట్ మోహన్‌రావుపై గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు పీజీఆర్‌ఎస్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఏపీడీ శ్రీనివాసరావు సచివాలయంలో ఫిర్యాదుదార్లతో పాటు మేట్లతో విచారణ చేపట్టారు. రెండేళ్లలో ఒక్క రోజు మాత్రమే టెక్నికల్ అసిస్టెంట్ పని ప్రదేశానికి వచ్చి కొలతలు తీశారని, మిగతా రోజుల్లో వీఆర్‌పీ(ఎఫ్‌ఏ)మస్తర్లు, కొలతలు తీసుకెళ్లేవారని ఖండివరం గ్రామానికి చెందిన ఉపాధి మేట్‌లు ఏపీడీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సచివాలయంలో తలుపులు ముసి విచారణ చేపట్టడంపై కూలీలు, గ్రామస్తులు విచారణ అధికారి శ్రీనివాసరావు, ఏపీవో గంగునాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకం ప్రారంభం నుంచి వీఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్న మోసూరి ఏసుబాబును రాజకీయ దురద్దేశంతో కొంత మంది గ్రామానికి చెందిన కూటమి నాయకుల ఒత్తిడితో విధుల నుంచి తొలగించారని మండల కో–ఆప్షన్ సభ్యుడు షేకు సూర్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. టెక్నికల్ అసిస్టెంట్ మోహన్‌రావు రెండేళ్లలో ఒక్క రోజే ఫిల్డ్‌కు వెళ్లి కొలతలు తీసుకున్నట్లు మేట్లు తెలియజేశారన్నారు. వీఆర్‌పీని సస్పెండ్ చెయ్యడంపై తనకు తెలియదన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.


