
క్వారీ బ్లాస్టింగ్‌లతో బెంబేలు
కొండలు తవ్వి పోలవరం కాలువ నిర్మాణ పనులు
పేలుళ్లకు ఇళ్లపై వచ్చి పడుతున్న రాళ్లు
దుర్గానగర్ ఏరియాలో జనం అవస్థలు
పట్టించుకోని అధికారులు
కొండ సమీపాన ఉన్న దుర్గానగర్
పాయకరావుపేట : పట్టణంలో గల దుర్గానగర్ ఏరియాలో బాంబు బ్లాస్టింగ్‌ల కారణంగా కాలనీవాసులు బెంబేలు చెందుతున్నారు. పోలవరం కాలువ నిర్మాణం పనుల్లో భాగంగా పట్టణంలో గల దుర్గానగర్ సమీపాన గల కొండలను తవ్వి కాలువ నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా కొండలపై రాళ్లు శిథిలం చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. బాంబులతో కొండపై వున్న పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం వల్ల కొండలను ఆనుకుని పక్కనే వున్న దుర్గానగర్ వాసులు బేంబేలెత్తుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాంబులు పెట్టి రాళ్లను కొట్టడం కారణంగా కాలనీవాసులకు నిద్రపట్టడం లేదు.. సరికదా ఎప్పుడు ఎక్కడ మీద పడుతుందో అన్న భయంతో హడలిపోతున్నారు. రాళ్లు పేల్చేటప్పుడు ఎగిరిపడి రాళ్లు తమ ఇళ్లపై పడుతున్నాయని, ఆ సమయంలో ఎవరైనా ఇంటి బయట ఉంటే గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. దీనిపై పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు బ్లాస్టింగ్‌లు చేపడుతున్నారన్నారు. ఆ శబ్ధాలు తమకు గుండె దడ కలిగిస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొండల పై బాంబు బ్లాస్టింగ్‌లు చేయకుండా పొక్లెయిన్‌లతో పనులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి..
పోలవరం కాలువ నిర్మాణ పనుల కారణంగా జరిపే బాంబు బ్లాస్టింగ్‌లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయి. బ్లాస్టింగ్‌లు నిలిపివేసి జేసీబీలతో పనులు చేసుకోవాలని కోరుతున్నాం.
–ఆకుల రామచక్రరావు, దుర్గాకాలనీ, పాయకరావుపేట
బ్లాస్టింగ్‌లు నిలిపివేయాలి
పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రాళ్లు వచ్చి మా ఇళ్లపై పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో ఉన్నాం. అధికారులు స్పందించ బ్లాస్టింగ్‌లు నిలుపుదల చేయాలని కోరుతున్నాం.
–పక్కుర్తి శ్రీనివాసరావు,దుర్గానగర్, పాయకరావుపేట

క్వారీ బ్లాస్టింగ్‌లతో బెంబేలు

క్వారీ బ్లాస్టింగ్‌లతో బెంబేలు

క్వారీ బ్లాస్టింగ్‌లతో బెంబేలు