
జీఎస్టీ తగ్గింపును ప్రజలకు చేరువ చేయాలి
పట్టణంలో జీఎస్టీ సంబరాలను ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి
అనకాపల్లి టౌన్: జీఎస్టీ తగ్గింపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి సూచించారు. పట్టణంలోని మెయిన్ రోడ్‌లో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్‌పై శనివారం అనకాపల్లి షాపింగ్ ఫెస్టివల్స్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తగ్గించిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడం, వినియోగదారుల్లో సరైన అవగాహన కల్పించడం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు పొదుపులపై స్పష్టతనివ్వడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా స్ధానిక వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: మండలంలోని బట్లపూడి పంచాయతీ రాయుడుపేట గ్రామంలో అనారోగ్యంతో అనుసూరి రమణ(42) అనే వ్యక్తి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందినట్టు రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.