
స్వచ్ఛతా కార్యక్రమంలో కలెక్టర్ శ్రమదానం
తుమ్మపాల : ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని శ్రమదానం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. కలెక్టరు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. స్వచ్ఛమైన గాలి అనే నినాదంతో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో వాహన కాలుష్యాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రయాణాలకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం, విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అనంతరం డీఆర్వో వై.సత్యనారాయణరావు అధికారులతో ‘ఒక అడుగు ముందుకు స్వచ్ఛతా వైపు’ అంటూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లో పలు విభాగాల అధికారులు విజయ కుమార్, వాసు సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అనుసంధానంగా జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ‘వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధుల నివారణ’పై శనివారం ఎస్పీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయం పరిసరాలను పోలీసులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ సీఐలు టి.లక్ష్మి, రమేష్, పోలీసులు పాల్గొన్నారు.
అనకాపల్లి టౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు కోరారు. స్థానిక డీఈవో కార్యాలయ ఆవరణలో పరిసరాలు పరిశుభ్రం చేసి వ్యర్థాలు తొలగించారు. ముందుగా కార్యాలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు.

స్వచ్ఛతా కార్యక్రమంలో కలెక్టర్ శ్రమదానం