
చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ
పెదగంట్యాడ,(విశాఖ) : శనివారం.. తెలవారుతున్న వేళ.. ఓ చిరు వ్యాపారిపై మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డాడు. వుడా డబుల్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివి. పెదగంట్యాడ మండలం వియ్యపువానిపాలేనికి చెందిన వియ్యపు అప్పయ్యమ్మ (48) వుడా డబుల్ రోడ్డులో కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఆమె తన దుకాణాన్ని తెరుస్తూ ఉంటుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో తన మనవుడు బంధం సాకేత్(5)తో కలసి దుకాణానికి వచ్చింది. అక్కడ కొబ్బరి బొండాలు సర్దుతుండగా శ్రీకాకుళం నుంచి పెదగంట్యాడకు ఇసుక లోడుతో వస్తున్న లారీ దుకాణంపైకి దూసుకొచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె మనవడు సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే వియ్యపువానిపాలేనికి చెందిన అప్పయ్యమ్మ బంధువులు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్‌ఐ సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనకాపల్లికి చెందిన లారీ డ్రైవర్ బారా గోవింద్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన సాకేత్ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుమారుడు వియ్యపు శ్రీను ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ

చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ