
ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి
అనకాపల్లి: ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లాల ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు పి.శ్రీనివాసరావు, వి.ఈశ్వరరావు, డి.అప్పలనాయుడు అన్నారు. స్థానిక శారదానది ఒడ్డున శాంతిపార్కులో ఆదివారం ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఉత్తీర్ణత సాధించగా, వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ఎంటీఎస్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, తమని రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే జీతాలు ఇచ్చి 62 సంవత్సరాలు సర్వీస్ పెంచాలన్నారు. 12 నెలలు ఉద్యోగం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి 150 కిలోమీటర్లు దూరం వెళ్లి ఉద్యోగాలు అనారోగ్యాలతో చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. రెండేళ్ల కాలంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, పదవీ విరమణ అనతరం తమకు ఆర్థిక సౌలభ్యం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎస్ ఉద్యోగులు సీతయ్యదొర, నాగేశ్వరరావు, నాగరాజు, రమణ, కనకరాజు, మంగపతి, మేరీ పాల్గొన్నారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయులు