
అక్రమార్కుల స్వారీ
న్యూస్‌రీల్
అనకాపల్లి
రంగురాళ్ల క్వారీల్లో
7
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
చుట్టం చూపుగా వచ్చి పోతున్న ఫారెస్ట్ సిబ్బంది
రెండు బేస్ క్యాంపులున్నా కొరవడిన నిఘా
నర్సీపట్నం: క్వారీల్లో విలువైన రంగురాళ్లు.. వాటి కోసం రహస్యంగా తవ్వకాలు.. వారిని కట్టడి చేయడానికి రెండు బేస్ క్యాంపులు.. అటవీ సిబ్బంది నిఘా లేక వృథా ప్రయత్నాలు.. ఇదీ నర్సీపట్నం నియోజకవర్గంలోని రంగురాళ్ల క్వారీల పరిస్థితి.. వర్షాకాలం కావడంతో తవ్వకాలకు అనుకూలంగా ఉంటుంది. దసరా రోజుల్లో అందరూ పండగ హడావుడిలో ఉంటారన్న ఉద్దేశంతో రంగురాళ్ల వేట మొదలవుతోంది. ఇలాంటి సమయంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అటవీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బేస్ క్యాంపుల వద్ద అటవీ సిబ్బంది కానరావటం లేదు. అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడల్లా రంగురాళ్ల వ్యాపారులు విజృంభించడం పరిపాటిగా మారింది. గొలుగొండ మండలంలో కరక, ఆరిల్లోవ అటవీ ప్రాంతాల్లో రంగురాళ్ల క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల వద్ద పేరుకు మాత్రం బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపుల వద్ద రాత్రింబవళ్లు సిబ్బంది కాపలా ఉండాలి. ప్రతి బేస్ క్యాంప్ వద్ద ఐదుగురు సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలి. కానీ బేస్ క్యాంపుల వద్ద కనీసం ఒక్కరు కూడా కానరాలేదు. సిబ్బంది మధ్యమధ్యలో చుట్టం చూపుగా వచ్చి చూసుకొని వెళుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది లేక బేస్ క్యాంపులు వెలవెలబోతున్నాయి. బేస్ క్యాంపులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆరుగురు సిబ్బందితో ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ టీమ్ కానరాలేదు. స్ట్రైకింగ్ సిబ్బందిని రేంజ్ కార్యాలయంలో వినియోగించుకుంటున్నారు. దీంతో రంగురాళ్ల క్వారీల వద్ద భద్రత కొరవడింది.
ఉదాశీనంగా ఉంటే ప్రమాదమే..
బేస్ క్యాంపు ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 2021 ఆగస్టులో కొంత మంది కరక కొండపై తవ్వకాలకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా రంగురాళ్ల తవ్వకాలకు సహకరించిన వ్యక్తి డీఎఫ్‌వో వద్ద అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్ అని తేలింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఇదే విధంగా గతంలో సిబ్బంది లేకపోవడాన్ని గమనించిన తవ్వకందారులు ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో తవ్వకాలకు సిద్ధం కాగా అటవీ సిబ్బంది అప్రమత్తమై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో తవ్వకందారులు అటవీ సిబ్బందిపై రాళ్లు రువ్వి తప్పించుకున్నారు. ఈ రెండు సంఘటనలు అప్పట్లో ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లోనే జరిగాయి. తవ్వకాలకు దిగిన కూలీలు క్వారీలు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ గతంలో ఉన్నాయి. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తవ్వకాలు మొదలైనట్టు సమాచారం. ఈ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అటవీ అధికారులు నిఘాను గాలికి వదిలేశారు. ఇక్కడి క్వారీల్లో లభ్యమయ్యే అలెక్స్ రకం రంగురాళ్లకు గిరాకీ ఉంది. వీటి ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇంతటి విలువ ఉన్నందునే రంగురాళ్ల వ్యాపారులు వీటి కోసం తరచూ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమై క్వారీల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అక్రమార్కుల స్వారీ