
సచివాలయ సిబ్బంది మెడకు పీ4 గుదిబండ
● అధికారులకు దాతలను వెతికి పట్టుకునే పనులు
● వాళ్లు ససేమిరా అనే సరికి సచివాలయ సిబ్బందికి అప్పగింత
● బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల మధ్య సమన్వయ బాధ్యతలు
● ఇప్పటికే పని ఒత్తిడితో నిరసన బాట పట్టిన సచివాలయ సిబ్బంది
సాక్షి, అనకాపల్లి: గ్రామ, వార్డు సచివాల య సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం పీ4 భా రం మోపింది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను వారు వెతికి పట్టుకోవాల్సి ఉంది. పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు సంధానకర్తలుగా సచివాలయ సిబ్బందే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న సచివాలయ సిబ్బంది కొత్త బాధ్యతలతో బెంబేలెత్తుతున్నారు. అధి కారం చేపట్టిన తరువాత వలంటీర్ వ్యవస్థను ని ర్దాక్షిణ్యంగా నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. వా రు చేసే ఇంటింటి సర్వే వంటి పనులను, వాట్సా ప్ సర్సీస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. సంక్షేమ పథకాలు, గ్రామ పరిపాలన సంబంధిత పనులతో రోజంతా బిజీబిజీగా ఉండే వారికి ఇప్పుడు పీ4 గుదిబండను తగిలించారు. అధికారుల ద్వారా మార్గదర్శకులు ముందుకు రాలేదన్న కారణంగానే.. సచివాలయ ఉద్యోగులకు ఈ పని అప్పగించారని భావిస్తున్నారు. సచివాలయ సిబ్బందికి ఇటీవల కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావలసిన అవసరాలు గుర్తించి మార్గదర్శులతో అనుసంధానం చేసే బాధ్యత తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 522 సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలకు గాను 2,06,526 మంది కుటుంబ సభ్యులను గుర్తించారు. 6,420 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. వారు ఇంతవరకు 47,597 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇంకా 32,571 కుటుంబాలను దత్తత చేసుకోవాల్సి ఉంది.
ప్రభుత్వానికి సిబ్బంది నోటీసులు
సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ఇంత కష్టపడుతున్నా తగిన గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందుతున్నారు. సమస్యల పరిష్కారం, ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్లతో ఇప్పటికే వారు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నట్లు ఈనెల 8న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.