
మహాచండీదేవిగా జగజ్జనని
నర్సీపట్నం: శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. విశేషాలంకారాల్లో కొలువైన జగజ్జనని భక్తులు దర్శించుకుంటున్నారు. పట్టణంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, బలిఘట్టం దేవాలయాల్లో ఏడో రోజు ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
స్టీల్‌ప్లాంట్ ఈవోఐల రద్దుకు నేడు పోరాట కమిటీ ధర్నా
ఉక్కునగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అడ్మిన్ కూడలి వద్ద ధర్నా చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ఉక్కు యాజమాన్యం 44 విభాగాల్లో ఈవోఐల కోసం నోటిఫికేషన్ చేసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్న ధర్నాలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై యాజమాన్యానికి తమ వైఖరిని తెలియజేయాలంటూ పోరాట కమిటీ నాయకులు జె. అయోధ్యరామ్, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ కోరారు.
ధర్నాకు అనుమతి లేదు
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన ధర్నాకు పోలీసు అనుమతి లేదని స్టీల్‌ప్లాంట్ సీఐ కేశవరావు తెలిపారు. ధర్నా చేయాలనుకుంటే జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేసుకోవాలి తప్ప ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద అనుమతించబోమన్నారు. అనుమతి లేని చోట ధర్నా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతభద్రతల దృష్ట్యా పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.