
న్యాయవాదులకు బార్ కౌన్సిల్ శుభవార్త
విశాఖ లీగల్: న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులకు అందించే వైద్య సహాయాన్ని ఇకపై వారి భార్యలకు కూడా వర్తింపజేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్ విశాఖలో ఆదివారం ప్రకటించారు. గతంలో రూ.1,50,000 ఉన్న వైద్య సహాయాన్ని రూ. 2,50,000కు పెంచారు. న్యాయవాదుల జీవనభృతిని రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. సంక్షేమ నిధి పరిధిలో లేని న్యాయవాదులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 5 లక్షలు చెల్లించాలని బార్ కౌన్సిల్ తీర్మానించింది. ఈ కొత్త పథకాలన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాలు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్. ద్వారకానాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తీసుకున్నారు. ఉపాధ్యక్షుడు కృష్ణమోహన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త కూటమి సర్కార్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. మృతి చెందిన సుమారు 1300 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల వంతున నిధులు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ‘లా మిత్ర’ పేరుతో ఎన్నికల హామీ ఇచ్చిన రూ. 10,000 గౌరవ భృతిని ఇప్పటివరకు విడుదల చేయలేదని, పది వేలకు పైగా ఉన్న యువ న్యాయవాదుల జీవన సహాయ నిధిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ప్రభుత్వం చెల్లించవలసిన రూ. 75 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.