
స్థానికులకు 70శాతం ఉద్యోగాలివ్వాలి
నక్కపల్లి : వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పలువురు కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే మద్దతు ఇస్తున్నామన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోతున్న స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ శనివారం జరిగింది. ఏఎంఎన్‌ఎస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్ మాట్లాడుతూ నక్కపల్లి మండలం చందనాడ, డీఎల్‌పురం అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఆర్సిలర్‌మిట్టల్ నిప్పన్ ఇండియా జాయింట్ వెంచర్‌తో సమీకృత స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల పరిధిలో 2020 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఉక్కు ఉత్పత్తుల్లో మిట్టల్, నిప్పన్ గ్రూపు ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. 15 దేశాల్లో 36 ప్లాంట్లు ఉన్నాయన్నారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌లో మొదటి దశలో ఏటా 8.2 మిలియల్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి గాను రూ.67వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ప్లాంట్ ఏర్పాటయితే ప్రత్యక్షంగా పరోక్షంగా మొదటి విడతలో 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ మాట్లాడుతూ బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 14 రోజుల నుంచి మత్య్సకారులు నిరాహరదీక్ష చేస్తున్నారని, ఈ పార్క్ రద్దు చేసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సూరాకాసుల గోవిందు, ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ రామకృష్ణారావు, జేఎన్‌టీయు విశ్రాంత వైస్‌చాన్స్‌లర్, మురళీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, విశ్రాంత ఆర్‌జేడీ ప్రభాకర్, టీడీపీ నాయకులు మాట్లాడారు. ప్లాంట్ ఏర్పాటు చేసే పరిసర గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వీసం రామకృష్ణ, తళ్ల భార్గవ్, జడ్‌పీటీసీ కాసులమ్మ, వైస్ ఎంపీపీ నానాజీ, ఈశ్వరరావు, మత్య్సకార సంఘాల నుంచి అమ్మోరయ్య కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం ఆర్‌డీవో రమణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.