
పీహెచ్‌సీ వైద్యుల నిరసన
అచ్యుతాపురం రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పీహెచ్‌సీ వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కె.శ్రావ్య, ఐ.లిఖిత మాట్లాడుతూ సివిల్ అసిస్టెంట్ సర్జన్, డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లకు 24 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు కల్పించకపోవడంతో సీనియారిటీకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 26 నుంచి రోజుకొక వైద్య సేవ నిలిపివేయనున్నట్టు చెప్పారు. శనివారం స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమం, 104 సంచార చికిత్స సేవలు బంద్ చేసినట్టు చెప్పారు. 28న అధికార వాట్సప్ గ్రూప్ బహిష్కరిస్తామని వారు చెప్పారు.సీనియారిటీ పదోన్నతి కల్పించాలని, ఇన్ సర్వీస్ కోటా పెంచాలని, ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, సంచార చికిత్స సేవలకు గాను గ్రామాలకు వెళ్లినందుకు అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.