
30.5 కిలోల గంజాయి స్వాధీనం
తాళ్లపాలెం వద్ద పోలీసులు పట్టుకున్న
గంజాయి, నిందితుడు
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత ప్రాంతంలో ఉన్న గంగాదేవి గుడి వద్ద కారులో తరలిస్తున్న 30.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఓ యువకుడి అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు శుక్రవారం తెలిపారు. మరొకరు పరారైనట్టు చెప్పారు. తాళ్లపాలెం సంత వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన కారును పరిశీలిస్తుండగా దానిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయ త్నించినట్టు సీఐ తెలిపారు. అనుమానంతో కారు డిక్కీ తెరచి చూడగా 5 ప్యాకెట్లలో 30.5 కిలోల గంజాయి లభించినట్టు చెప్పారు. దీని విలువ రూ.3.05 లక్షలు ఉంటుందన్నారు. ప్రధాన నిందితుడైన మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామానికి చెందిన మురుకుట్టి ఈశ్వర్ సాయి సతీష్(24)ను విచారించగా మరికొంత మంది ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర వహించినట్లు తెలిపారన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. సతీష్ గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడని తెలిపారు. గంజాయి, కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.