
పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిపై ఫిర్యాదు
అనకాపల్లి టౌన్: పెళ్లి చేసుకుంటానని నమ్మంచి రాజీవ్‌గాంధీ అనే యువకుడు తనను మోసం చేశాడని ఓ యువతి అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పట్టణ సీఐ విజయ్ కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన దొమ్మేసి సరూన్‌కు చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన కుంచెల రాజీవ్‌గాంధీతో 2021లో పెళ్లి చూపులు జరిగాయి. అయితే యువతి తండ్రికి ఇష్టం లేకపోవడంతో పెళ్లి జరగలేదు. అప్పటి నుంచి సరూన్‌తో రాజీవ్ గాంధీ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అనకాపల్లిలోని చినబాబు కాలనీలో ఉన్న తన అక్క ఇంటికి సరూన్‌ను తీసుకువెళ్లి శారీరంగా లోబరుచుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని కోరుతున్నా వివిధ కారణాలతో దాటవేస్తున్నాడని, రాజీవ్ గాంధీతో పాటు అతని అక్క, బావ, తమ్ముడులు కూడా పెళ్లి చేస్తామని తనను మోసం చేశారని సరూన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ తెలిపారు.
అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగింత
చోడవరం: బాలిక అదృశ్యం కేసును చోడవరం పోలీసులు వెంటనే ఛేదించారు. ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. అనంతగిరి మండలానికి చెందిన బాలిక చోడవరం పట్టణంలోని ఎస్టీ కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సెలవులు కావడంతో గురువారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికని బయలు దేరింది. అప్పటి నుంచి ఆ బాలిక కనిపించకపోవడంతో తండ్రి చిక్కయ్య చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ అప్పలరాజు పర్యవేక్షణలో ఎస్‌ఐ నాగకార్తీక్ తన సిబ్బందితో బాలిక ఆచూకీ కోసం వెతికారు. బాలిక మాకవరపాలెం వద్ద కనిపించడంతో వెంటనే పోలీసులు పట్టుకొని చోడవరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివరాలు తెలుసుకొని తహసీల్దార్ రామారావు సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించినట్టు ఎస్‌ఐ నాగకార్తీక్ చెప్పారు.
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగపాక: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. మండలంలోని వాడ్రాపల్లిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రక్షితమంచినీటి పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, ఎంపీడీవో ఎం.ఉషారాణి,ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మానస తదితరులు పాల్గొన్నారు.