
డి–పట్టా భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలి
మాడుగుల రూరల్/రావికమతం: రావికమతం మండలం ఉరవలోవ రెవెన్యూ పరిధిలో డి– పట్టా భూములను వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన రైతులు శుక్రవారం రావికమతం మండలం కొమిర గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేయగా, మాడుగుల మండలం ఒమ్మిలిలో మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేశారు. ఒమ్మిలిలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు కార్లె భవానీ, గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇ.నర్సింహమూర్తి మాట్లాడుతూ 2016–17 సంవత్సరంలో 6వ విడత భూ పంపిణీలో రావికమతం, వి.మాడుగుల మండలాల సరిహద్దులోని ఉరవలోవ కొండ ప్రాంతంలో ఈ రెండు మండలాలకు చెందిన ఒమ్మలి, వీజేపురం, కృష్ణాపురం, కొమిర, మత్స్యపురం,బుడ్డిబంద గ్రామాలకు చెందిన వారికి పట్టాలిచ్చారని చెప్పారు. ఈ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయకపోవడంతో లబ్ధిదారులు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వల్ల పేదలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై పలు మార్లు తహసీల్దార్లు, కలెక్టర్‌కు అర్జీలు అందజేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ సమస్యపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే తమకు ఉరితాళ్లే శరణ్యమని చెబుతూ లబ్ధిదారులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కొమిర సచివాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ డి–పట్టా భూముల్లో గిరిజన రైతులు జీడి తోటలు సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒమ్మిలిలో జరిగిన కార్యక్రమంలో ఇలక అచ్చియ్యమ్మ, తట్ట వెంకటలక్ష్మి, తాటికొండ చిన నాగరాజు, రాచర్ల సూరిబాబు, పైలా అప్పలనర్సమ్మ, కొండమ్మ పాల్గొన్నారు. కొమిర గ్రామ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యదర్శి రాజు,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి దేముళ్లు, అప్పలనాయుడు, గిరిజన సంఘం నాయకులు సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డి–పట్టా భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలి