
ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్ చోరీ
యలమంచిలి రూరల్: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి సోమన్నపాలెం వద్ద కొంతకాలంగా డీజిల్,పెట్రోల్ ట్యాంకర్ల నుంచి ఇంధనం దొంగలిస్తున్న నలుగురిని యలమంచిలి రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోమన్నపాలెం సమీపంలో పాత జాతీయరహదారి పక్కన ఎస్.రాయవరం మండలం వొమ్మవరానికి చెందిన షేక్ జానీ ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అక్రమంగా ట్యాంకర్ల లోంచి డీజిల్,పెట్రోల్ చోరీ చేస్తున్నారు.ట్యాంకర్లకు ఉన్న సీలు తొలగించకుండా చాకచక్యంగా తాళం తెరిచి ఇంధనం చోరీకి పాల్పడుతున్నారు.ఈ సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు శుక్రవారం అక్కడకు వెళ్లి పరిశీలించి, డీజిల్ చోరీ చేస్తుండగా నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీజిల్ లోడుతో రాంబిల్లి ఐవోసీఎల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరానికి వెళుతున్న ఏపీ39యూ1389 నంబరు గల ట్యాంకర్‌ను సోమన్నపాలెం వద్ద ఆపి డీజిల్ చోరీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్, మరో ఇద్దరు ఉన్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ కె. సావిత్రి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 లీటర్ల డీజిల్, 50 లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు నిందితులపై కేసు నమోదు