
పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
కశింకోట : జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగను కశింకోట పోలీసులు చాక చక్యంగా పట్టుకొని 8 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు గురువారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. మండలంలోని అచ్చెర్ల కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా పారిపోతున్న కోటవురట్ల మండలం రామచంద్రపాలెం గ్రామానికి చెందిన కరక రాజుబాబు(46)ను తమ సిబ్బంది సహకారంతో పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా గతంలో సుమారు 30 దొంగతనాలు చేసి 15 దఫాలు జైలుకు వెళ్లినట్టు అంగీకరించారన్నారు. మాకవరపాలెం మండలం తామరం పీఏసీఎస్‌లో దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలిపాడన్నారు. అలాగే ఈ ఏడాది జనవరి 27న కశింకోటలో జరిగిన 15 తులాల బంగారం దొంగతనాన్ని తానే చేసినట్టు అంగీకరించాడన్నారు. ఈ సందర్భంగా మధ్యవర్తుల సమక్షంలో నిందితుని బ్యాగు నుంచి 8 తులాల బరువు కలిగిన పలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడిని విజయవంతంగా పట్టుకున్నందుకు తమను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారన్నారు.