
వ్యాన్ ఢీకొని బాలుడి మృతి
మాడుగుల రూరల్ : డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని బాలుడి ప్రాణం గాలిలో కలిసి పోయింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి. నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాడుగుల జగ్గన్నచావిడి ప్రాంతానికి చెందిన గుంపాన జయంత్(7) జగ్గన్న చావిడి వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా చీడికాడ మండలం ఎల్.బి.పట్నం (బోయపాడు) నుంచి మాడుగుల జంక్షన్ వైపు వస్తున్న ఏపి35 డబ్ల్యూ 3587 నంబరు గల టాటాఏస్ గూడ్స్ వ్యాన్ డ్రైవరు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి జయంత్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రోడ్డు మీద పడిపోయిన బాలుడి ఛాతీపై నుంచి వ్యాన్ టైరు వెళ్లిపోవడంతో అతని నోటి నుంచి రక్తస్రావం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలో వున్న మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యాధికారి పరీక్షించి అప్పటికే జయంత్ చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడు తండ్రి అచ్యుతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అచ్యుతరావుకు ఇద్దరు కుమారులు కాగా, మృతుడు రెండో కుమారుడు రెండో తరగతి చదువుతున్నాడు. అచ్యుతరావు తాపీ మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని గురువారం సాయంత్రం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టంకు పంపించినట్టు ఎస్‌ఐ తెలిపారు.