
పరిశ్రమల దరఖాస్తులను త్వరగా ఆమోదించాలి
46 భారీ, అతి భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు
రూ.2,89,161.85 కోట్ల పెట్టుబడులు, 1,56,556 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: పరిశ్రమల ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 16వ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పి.కె.పి. ప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.నరసింహారావు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత జులై 29న జరిగిన సమావేశం తరువాత నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల అనుమతి కోసం 1,573 దరఖాస్తులు రాగా, వాటిలో 1,462 దరఖాస్తులను ఆమోదించామన్నారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మిగిలిన దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 12 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 21 దరఖాస్తులు రాగా, రూ.7.46 కోట్ల విడుదలకు కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. నక్కపల్లిలో కొత్తగా వరాహ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాగే 46 భారీ, అతి భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ.2,89,161.85 కోట్ల పెట్టుబడులు, 1,56,556 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ముకుందరావు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ సెంతిల్ కుమార్, ఫ్యాప్ షియా జిల్లా సమన్వయకర్త వై.సాంబశివరావు, జిల్లా కర్మాగారాల ఉప ముఖ్య ఇన్‌స్పెక్టర్ పరమేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గోవిందరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.