
భవానీ భక్తులకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.ఽధీరజ్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఐదు రూటుల్లో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. నర్సీపట్నం నుంచి విజయవాడ వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.800, అల్ట్రా పల్లె వెలుగు రూ.900, ఎక్స్‌ప్రెస్ రూ.వెయ్యి, అల్ట్రా డీలక్స్ రూ.1250గా టికెట్ ధర నిర్ణయించామన్నారు. ద్వారపూడి మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.860, అల్ట్రా పల్లె వెలుగు రూ.970, ఎక్స్‌ప్రెస్ రూ.1070, అల్ట్రా డీలక్స్ రూ.1350, ద్వారపూడి, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.910, అల్ట్రా పల్లె వెలుగు రూ.1030, ఎక్స్‌ప్రెస్ రూ.1140, అల్ట్రా డీలక్స్ రూ.1420 చార్జి చేస్తామన్నారు. ద్వారపూడి, గొల్లలమామిడాడ, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.970, అల్ట్రా పల్లె వెలుగు రూ.1090, ఎక్స్‌ప్రెస్ రూ.1210, అల్ట్రా డీలక్స్ రూ.1510, భద్రాచలం మీదుగా విజయవాడ వెళ్లి ద్వారపూడి మీదుగా తిరిగి రావడానికి పల్లె వెలుగు రూ.1190, అల్ట్రా పల్లె వెలుగు రూ.1340, ఎక్స్‌ప్రెస్ రూ.1490, అల్ట్రా డీలక్స్ రూ.1850గా రేట్లు నిర్ణయించామన్నారు. 50 మంది భవానీ భక్తులు ఉంటే నర్సీపట్నం పరిసర గ్రామాల నుంచే నేరుగా బస్సులు నడుపుతామని తెలిపారు. ఆసక్తిగల వారు 9493211969, 949811855 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు.
విజిలెన్స్ అవగాహన వాకథాన్
సీతంపేట (విశాఖ): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్ అవగాహన వాకథాన్, సముద్రతీర శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలుత ద్వారకానగర్‌లో ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు విజిలెన్స్ వాక్‌థాన్‌లో పాల్గొని, పాలనలో జాగ్రత్త (విజిలెన్స్), పారదర్శకత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లో సముద్రతీర శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రధాన అధికారి ఏవీ రమణమూర్తి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి జాగ్రత్త (విజిలెన్స్), శుభ్రత రెండూ తప్పనిసరి అని అన్నారు.