
చల్లారని ఆగ్రహం
●రాత్రంతా కొనసాగిన దీక్ష.. 11వ రోజూ మత్స్యకారుల నిరశన ●అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక వస్తానని హోంమంత్రి వీడియో సందేశం
●అయినా ఆందోళన కొనసాగింపు
నిరాహార దీక్షకు మద్దతుగా తరలివచ్చిన మహిళలు
రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు
నక్కపల్లి: బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం రాత్రంతా ఆందోళన కొనసాగించిన రాజయ్యపేట మత్స్యకారులు 11వ రోజైన గురువారం కూడా నిరశన చేపట్టారు. తమ ఆవేదనకు హోం మంత్రి అనిత స్పందించకపోగా.. ఆర్సిలరీ మిట్టల్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ నక్కపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడంతో మత్స్యకారులు అగ్గి మీద గుగ్గిలమయిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజయ్యపేటలో జరుగుతున్న పనులను అడ్డుకుని రోడ్డుపై నిప్పు పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తెల్లవార్లూ అక్కడే ఆందోళన చేసి, గురువారం ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగించారు. పూరీ, కోణార్క్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వందలాది మంది మత్స్యకారులు రైళ్లలో, బస్సుల్లో స్వగ్రామానికి తిరిగి వచ్చి వారితో గొంతు కలిపారు. అక్కడే వంట వార్పు చేసుకొని, దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు సంఘీభావం ప్రకటించి, వారితోపాటు సాయంత్రం వరకు నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు.
అధికారులు నచ్చచెప్పినా ససేమిరా
నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ విజయలక్ష్మి వచ్చి చర్చలు జరిపేందుకు సిద్ధపడగా, మత్స్యకారులు అంగీకరించలేదు. మీతో మాకు సంబంధం లేదని, హోం మంత్రి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. పది రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అనిపించలేదని మత్స్యకార నాయకులు మోసా అప్పలరాజు, గోసల రాజశేఖర్, పిక్కి తాతీలు, ఎరిపల్లి నాగేశు, మహేష్ కాశీరావు, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ తదితరులు విమర్శించారు. సహనాన్ని పరీక్షిస్తే ప్రాణాలను సైతం లెక్క చేయమన్నారు. జైళ్లకు వెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు.
వీసం రామకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, వారితోపాటు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు అప్పలరాజు మాట్లాడుతూ బల్క్‌డ్రగ్ పార్కు వల్ల ఇబ్బంది ఉండదని టీడీపీ నాయకులు, అధికారులు చెబుతున్నారని, అచ్యుతాపురం, పరవాడలలో ఇటువంటి పార్కులు ఉన్నాయని, అక్కడ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పరిశీలన చేద్దామని, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెబితే స్వచ్ఛందంగా ఆందోళన విరమిస్తామన్నారు.
హోం మంత్రి వీడియో ప్రకటన
సాయంత్రం హోం మంత్రి అనిత వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉండటం వల్ల రాజయ్యపేట రాలేకపోయానన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే వచ్చి చర్చలు జరుపుతానన్నారు, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంత్రి మాట్లాడిన వీడియోను ఆర్డీవో రమణ ఆందోళనకారులకు వినిపించారు. దీంతో మత్స్యకారులు రోడ్డుపై నుంచి ఆందోళనను నూకతాత ఆలయానికి మారుస్తున్నామని, అక్కడ ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసుకొని దీక్ష కొనసాగిస్తామన్నారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చి సంతృప్తి చెందినతేనే ఆందోళన విరమిస్తామని, పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష మరింత ఉధృతం చేస్తామన్నారు.

చల్లారని ఆగ్రహం