
స్వచ్ఛతతో ఆరోగ్యం, ఆనందం
తుమ్మపాల: ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పిసినికాడ శ్మశానవాటికలో గురువారం ‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులతో కలిసి పరిసరాలు, కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా శ్రమదానం చేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామంలో వెంటనే ట్రాక్టర్ తొట్టి కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, డంపింగ్ యార్డ్ వద్ద చెత్త నిలువ ఉండకూడదని, ఎప్పటికప్పుడు తరలించాలని ఆదేశించారు. ఆర్డీవో షేక్ ఆయిషా, సర్పంచ్ రమేష్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.