
వడ్డాదిలో విషాదఛాయలు
తాచేరు నదిలో పడి వడ్డాదికి చెందిన కాళ్ల సుబ్బారావు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వడ్డాది, విజయరామరాజుపేట రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. రెండు గ్రామాల మధ్యన తాచేరు నది ఉంది. నదిని ఆనుకొని రెండు గ్రామాల రైతులకు పంట పొలాలున్నాయి. బుధవారం తాచేరు నది దాటి తన పొలంలోకి వెళ్లిన సుబ్బారావు రాత్రయినా తిరిగి ఇంటికి రాలేదు. తాచేరు నది డైవర్షన్ రోడ్డు కోతకు గురవడంతో నది దాటలేక పొలంలో పాకలో ఉండిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. బుధవారం ఉదయం డైవర్షన్ రోడ్డు వద్ద సుబ్బారావు మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీనివాసరావు పరిశీలించారు. సుబ్బారావు మృతదేహాన్ని నీటిలో నుంచి బైటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు వివాహమైన ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.