
నేత్రపర్వంగా వెంకన్న ధ్వజారోహణం
నక్కపల్లి: ఉపమాక శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా జరిగింది. గరుదాద్రిపై మూలవిరాట్‌కు నిత్యపూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్కి వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను, సుదర్శన పెరుమాళ్లను (చక్రత్తాళ్వార్) పెద్ద పల్లకిలో ఉంచి భేరీ పూజ నిర్వహించారు. ఆలయంలో అష్టదిక్పాలకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ గ్రామ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ధ్వజపటాన్ని ఎగుర వేసి స్వామివారి బ్రహోత్సవాలకు భక్తజనంతోపాటు, అష్ట దిక్పాలకులు కూడా ఆహ్వానితులేనంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. గరుడ పొంగలి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. సాయంత్రం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో అధిష్టింపజేసి గ్రామ బలిహరణలు పూర్తి చేశారు. రాత్రి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన జరుగుతుందని అర్చకులు తెలిపారు.
అష్టదిక్పాలకులకు బ్రహ్మోత్సవ ఆహ్వానం

నేత్రపర్వంగా వెంకన్న ధ్వజారోహణం