
ఉచిత విద్య, వైద్యం హామీలకే పరిమితమా..!
వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడపాలి
జీవో నంబర్ 590ను తక్షణమే రద్దు చేయాలి
సీపీఐ ఆందోళన
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యను పేద ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాల్సిన పాలకులు విద్య ,వైద్యం ఉచిత విద్య అనే హామీలు కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారని, ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన విద్య, వైద్యా రంగాలను ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ దోపిడీ వర్గాలకు అప్పగించే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో అందరికీ వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను గత ప్రభుత్వం కోరిక మేరకు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థలో నడపడానికి నిధులు విడుదల చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మెడికల్ కళాశాలలు ప్రారంభించగా, మిగిలిన మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయకుండా మొత్తం 17 మెడికల్ కళాశాలలు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇస్తూ జీవో నంబర్590ని జారీ చేయడం అన్యాయమన్నారు. మెడికల్ కళాశాలలో జీవో నెంబర్ 107, 108 అమలు పరుస్తూ ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ఏ క్యాటగిరి కన్వీనర్ కోటా కింద, బి కేటగిరిలో ఏడాదికి రూ.12 లక్షలు, సీ క్యాటగిరిలో ఏడాదికి రూ.20 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాని ఇచ్చిన హామీ ఇచ్చి ఏంచేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సభ్యుడు దేవుడు బాబు, బి.బాబ్జి , సత్తిబాబు, ఆర్.శంకరరావు, సత్యనారాయణ, పోతురాజు పాల్గొన్నారు.