
చిరు వ్యాపారులపై ఇదేం దౌర్జన్యం
అనకాపల్లి: రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో కుటుంబాన్ని నేట్టుకొస్తున్న సమయంలో పట్టణ పరిధిలో రహదారులపై చిరు వ్యాపారం, తోపుడుబండ్లు, కూరగాయల దుకాణాలు పెట్టుకొని జీవిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వివి.శ్రీనివాసరావు అన్నారు. జోనల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఽఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏళ్ల తరబడి రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న పేదలపై రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఉపాధి చూపక, ఏ ఆధారం లేక రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారికి ఉపాధి లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని దుయ్యపట్టారు. పేదలను లక్షాధికారులను చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు జీవించడానికి చిరు వ్యాపారాలు చేసుకునే వారిని రోడ్డుపాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పేదలపై దౌర్జన్యాన్ని విరమించాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షుడు గంటా శ్రీరామ్, మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు, శ్రీను, రమణ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం...
ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ అధికారులు పట్టణ పరిధిలో బడ్డీల తొలగింపు, చిరు వ్యాపారంపై దాడులు ఆపాలలని ఏపీ వీధి విక్రయదారులు ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ అన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ముద్ర లోన్లు ,రోజువారి ప్రైవేట్ ఫైనాన్స్‌లు కట్టుకోలేక వస్తున్న ఆదాయం సరిపోక సతమతమవుతున్న విషయం అధికారులు ,ప్రజా ప్రతినిధులు గుర్తించాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా పక్కనపెట్టి వారికి అన్ని ప్రాంతాల్లో హాకర్స్ జోన్, గుర్తింపుకార్డులు మంచినీరు, టాయిలెట్స్ మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఉన్నప్పటికీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని వెల్లగొట్టే చర్యలు ఆపాలన్నారు. యూనియన్ జిల్లా నాయ కుడు నాగేశ్వరరావు, చిరు వ్యాపారులు జి త్రినాథ్, బంటు సూర్యనారాయణ, ఎ.వి. అప్పారావు, రామకృష్ణ, కొండలరావు, గురుమూర్తి ,బాబ్జి, పి ఎస్.ఆర్ రాజు, కోనేటి శ్రీనివాస్‌రావు, నాగు పాల్గొన్నారు.