
వెర్రిగెడ్డ ఆనకట్టకు గండి
నాతవరం: వెర్రిగెడ్డ ఆనకట్ట గట్టు లోపల భాగంలో రంధ్రం పడి సాగు నీరంతా వృధాగా బయటకు పోతుంది. మండలంలో మర్రిపాలెం పంచాయతీ శివారు మాదంపూడి గ్రామ సమీపంలో వెర్రిగెడ్డ ఆనకట్ట ఉంది. ఈ అనకట్ట నీరు ఆధారంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులు వరి పంట 5వేల ఎకరాల్లో వేస్తుంటారు. తాండవ రిజర్వాయరు ఉన్నప్పటికీ మర్రిపాలెం డి.పంచాయతీలు పరిధిలో వెన్నలపాలెం, డి.యర్రవరం, డొంకాడ, మాదంపూడి, పొట్టిపాలెం, యరకంపేట, బాపన్నపేట కొత్త ఎల్లవరం తాండవ జంక్షన్ ములగపూడి గ్రామాలకు తాండవ ప్రాజెక్టు నీరు ప్రవహించదు. ఆయా గ్రామాల పరిధిలో రైతులంతా వెర్రిగెడ్డ ఆనకట్ట నీరుపై ఆధారపడి ఖరీఫ్‌లో రినాట్లు వేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ గెడ్డల నుంచి నీరు అఽధిక మొత్తంలో వెర్రిగెడ్డ ఆనకట్టలోకి వచ్చి చేరింది. ఆనకట్ట గట్టు మట్టితో నిర్మించింది కావడంతో గట్టు లోపల భాగంలోంచి రంఽధ్రం ఏర్పడి నిత్యం సాగు నీరంతా వృధాగా పోతుంది. రంధ్రం పడిన ప్రదేశాన్ని గుర్తించిన రైతులు దానిని మసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం అయకట్టు పరిధిలో రైతులంతా వరినాట్లు వేసుకుని కలుపు తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ జేఈ రవికిరణ్‌ను వివరణ కోరగా గండి పడిన విషయాన్ని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాను స్వయంగా పరిశీలించి నీటి సంఘం ప్రతినిధులతో చర్చించి నీరు వృధాగా పోకుండా చర్యలు చేపడతామన్నారు.

వెర్రిగెడ్డ ఆనకట్టకు గండి