
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
బుచ్చెయ్యపేట: విజయరామరాజుపేట తాచేరు నదిలో గల్లంతైన 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్(13) శవమై తేలాడు. మంగళవారం సాయంత్రం తన తమ్ముడు రిషిత్‌తో కలిసి పేట తాచేరు నదిపై గండి పడిన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ తాచేరు నదిలో పడిపోయి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు తమ సిబ్బంది,అగ్నిమాపక సిబ్బందితో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా రోహిత్ ఆచూకీ దొరకలేదు. బుధవారం ఎన్‌డీఎర్‌ఎఫ్ బృందంతో ఎస్‌ఐ గాలింపు చర్యలు చేపట్టారు. విజయరామరాజుపేట గాయత్రి కాలేజీ ఎదురుగా ఉన్న పెద్దేరు నదిలో తుప్పల్లో రోహిత్ మృతదేహం లభ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద అన్నం తిని ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమారుడు బుధవారం శవమై తిరిగి రావడంతో బాలుడి తల్లిదండ్రులు గోపి, సూర్యలక్ష్మి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డును బాగు చేసి ఉంటే తమ కుమారుడు బతికేవాడని మృతుడి తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్ విజయ్‌కుమార్, కోఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు గోవింద, రాష్ట్ర అఖిల గాండ్ల తెలుకుల సంఘం మాజీ డైరెక్టర్ చిత్రాడ జగదీష్ వాపోయారు.