
పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ధర్నా
నర్సీపట్నం: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల 12వ పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పీఆర్‌సీ పెంచి జీతాలు పెంచాలన్నారు. డీఏ, సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించాలన్నారు. మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీ మేరకు గత జూలైలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు జీతం చెల్లించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన 13 గంటల పనిదినాన్ని రద్దు చేయాలన్నారు. మహిళలతో రాత్రి పూట షిప్ట్‌లో చేయించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. రిటైర్మెంట్, అనారోగ్యంతో చనిపోయిన వారి స్థానాల్లో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలన్నారు. కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయకుండా మాది మంచి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం.లోవరాజు, బాబురావు, వి.రమణ, నూకరాజు, సంపత్, అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు.