
ఆశలు గల్లంతు
తాచేరు నదిలో కొట్టుకుపోయిన బాలుడు
తీవ్ర వర్షంలో గాలించినా దొరకని ఆచూకీ
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
బుచ్చెయ్యపేట: తమ్ముడితో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు నీట మునిగాడు. తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిలో పడి ఆడారి రోహిత్ (13) గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆడారి గోపి, సూర్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రోహిత్ 8 తరగతి, రెండో కుమారుడు రిషిత్ 6వ తరగతి చదువుతున్నారు. గోపి అచ్యుతాపురం వద్ద ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరవాత గ్రామంలో ఉన్న తాచేరు వంతెన వద్దకు అన్నదమ్ములిద్దరూ వెళ్లారు. మూడు గంటల ప్రాంతంలో వర్షం వచ్చేలా ఉండటంతో కోతకు గురైన తాచేరు రోడ్డు వద్ద నుంచి ఇంటికి వస్తుండగా.. రోహిత్ కాలి చెప్పు ఒకటి ఊడిపోయి నీటిలో పడిపోయింది. దాని కోసం నీటిలోకి దిగిన ఆ బాలుడు కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న అతని తమ్ముడు రిషిత్ వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే రోహిత్ నీట మునిగాడు. స్థాకులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు పోలీసులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బందితో జోరు వానలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రోహిత్ తల్లిదండ్రుల రోదనలు చూపరులను కదిలించాయి.
నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు
బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై ఉన్న డైవర్షన్ రోడ్డు ఆగస్టు 17వ తేదీన కోతకు గురైంది. దీంతో విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు మూడు జిల్లాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. తాచేరు డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనులకు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కె.ఎన్.ఎస్.ఎన్.రాజు సెప్టెంబర్ 6వ తేదీన శంకుస్థాపన చేశారు. 17 రోజులైనా కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద గుప్పెడు మట్టి వేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి బలైపోయాడని గ్రామస్తులతోపాటు పలు గ్రామాల ప్రయాణికులు ఆగ్రహం చెందుతున్నారు. సకాలంలో మరమ్మతు పనులు చేసి ఉంటే బాలుడి ప్రాణాలు మిగిలేవని, తక్షణం మరమ్మతు పనులు చేపట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

ఆశలు గల్లంతు