
అర్ధ నగ్నంగా మత్స్యకారుల దీక్ష
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలంటూ రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం మత్స్యకారులు అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేసే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత వెన్నుపోటు పొడిచారని మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు, పిక్కి తాతీలు, మహేష్, పిక్కి స్వామి, మైలపల్లి సూరిబాబు, తదితరులు ఆరోపించారు. కూటమి నాయకులు చేసిన మోసాన్ని మత్స్యకారులంతా తగ్రహిస్తున్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గ్రామాలకు రప్పిస్తున్నామని, అందరూ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఈ ఆందోళనలో బాబ్జి, కాశీరావు, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.