
తాండవ కాలువలో జారిపడి యువకుడి మృతి
నాతవరం: తాండవ కాలువలో ప్రమాదశావత్తు జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాతవరం గ్రామానికి చెందిన దుండు తేజ(31) సోమవారం సాయంత్రం ఇండియన్ గ్యాస్ ఆఫీసు ఎదురుగా ప్రవహిస్తున్న తాండవ కాలువలోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. వర్షానికి బురదమయమైన కాలువ గట్టుపై నుంచి ఆయన జారిపోయాడు. కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఎవరూ చూడలేదు. తేజ రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు స్నేహితులు, బంధువులను వాకబు చేశారు. నాతవరం, గాంధీనగరం గ్రామాల మధ్య కాలువలో మృతదేహం కొట్టుకువస్తూ కర్రి రాజుబాబు పొలం వద్ద కల్వర్టులో చిక్కుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు తండ్రి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కల్వర్టులో వేలాడుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. అవివాహితుడైన తేజ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నాతవరం ఎస్‌ఐ కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.